ఈ భూమి పై బ్రతకడానికి, పొట్ట కూటి కోసం కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్న ఓ తల్లి.

ఆమెకు ఒక్కగానొక్క కొడుకు పేరు ధనుష్.

కంటికి రెప్పలా ఏ కష్టం రాకుండా సంతోషంగా చూసుకుంటూ ఆనందంగా జీవిస్తుంది.

ఓరోజు వెన్నెల రాత్రిలో ఆరు బయట మంచం వేసుకొని ఆ తల్లి కొడుకులు మాట్లాడుకుంటు ఉన్నారు. ఇలా మాట్లాడుతూ ఉండగా

 ధనుష్ అమ్మతో అంటున్నాడు.అమ్మా... రేపు నా పుట్టిన రోజు కదా...నాకు ఏం బహుమతి ఇస్తావమ్మా.? ఎప్పుడు నా పుట్టిన రోజుకి ఏదో ఒకటి ఇస్తావు కదా...! మరి ఈసారి నాకు ఏమిస్తావమ్మా….? అని అడుగుతాడు.

అప్పుడు అమ్మధనుష్ తో నాన్న నీకు ఇంతకుముందు చాలా బహుమతులు ఇచ్చాను కదా

ఈ సారి కూడ తప్పకుండా ఇస్తాను. అది నీకు ఎప్పుడు గుర్తిండి పోయేలా ఎప్పుడు నీతో ఉండే బహుమతి ఇస్తాను. అప్పుడు ధనుష్ నిజంగానా...! అమ్మ అదేంటో చెప్పమ్మా... అని మారం చేస్తూ ఉన్నాడు.అప్పుడు అమ్మ సరే సరే చెప్తాను. మరి నువ్వు నాకు ఏమిస్తావు  చెప్పు అని అంది.  కొడుకు ఆలోచిస్తూనేనేమీవ్వాలి అమ్మ...నీకేం కావాలో నువ్వే చెప్పు అని అడిగాడు.

 అప్పుడు అమ్మ నాకేం వద్దు ఒక మాట ఇవ్వురా  చాలు అన్నది. అప్పుడు ధనుష్ సరే అమ్మా ... ఏంటో ఆ మాట చెప్పు అని అన్నాడు.

 అప్పుడు అమ్మ తన కొడుకుతో ఇలా అంటుంది. నాన్న ధనుష్ ... నువ్వు బాగ చదువుకొని, ఒక గొప్ప స్థాయిలో ఉండి,అందరి చేత మంచి పేరు తెచ్చుకొని, ఎప్పుడు సంతోషంగా ఉంటానని మాట ఇవ్వు చాలు అన్నది. దానికి సమాధానంగా సరే అమ్మ నీ మాట తప్పకుండా నేరవేరుస్తాను  అని అమ్మని గట్టిగా  హత్తుకున్నాడు . అపుడు అమ్మ ధనుష్ తో ఇప్పటికే చాల ఆలస్యమైంది ఇక పడుకో నాన్నఅని పడుకో బెట్టి తను కూడ పడుకుంది తెల్లవారింది..

ధనుష్ కళ్ళు తెరిచి చూసే సరికి తను తన మంచం పై కాకుండా ఆసుపత్రి మంచం పై పడుకొని ఉన్నాడు. తన చేతిలో ఒక చీటి ఉంది. అదేంటో చూద్దాం అని  చూసేసరికి అతని దగ్గరికి డాక్టర్ వచ్చాడు వెంటనే ఆ చీటీ అటు పక్కన పడేసి డాక్టర్ గారు నేను ఇక్కడికి ఎలా వచ్చాను...? నాకు ఏమయింది చెప్పండి డాక్టర్...?

అయినా మా అమ్మ ఏది డాక్టర్ గారు, ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు.అపుడు ఆ డాక్టర్ , ధనుష్ తో,మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు నీ గురించి, నీ కోసమే, వెళ్ళింది. వస్తుందిలే ఏం కంగారు పడకు  నీకు చిన్న ప్రాబ్లమ్ ఉంది అందుకే  చిన్న ఆపరేషన్ చేసాము అని చెప్పాడు.

అప్పుడు  ధనుష్ ధన్యవాదాలు డాక్టర్ గారు అని చెప్పి వాళ్ళ అమ్మను వెతకటానికి  అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

 ధనుష్, ఇల్లు,ఊరు అని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ అమ్మ గురించి వెతుకుతూ ఉన్నాడు

అతను అలా వెతికి వెతికి,విసిగి వేసారి పోయి చివరికి తన అమ్మ మీద అసహ్యం కోపం పెరిగి పోయింది. మా అమ్మ నన్ను కావాలనే విడిచి వెళ్ళిందని అమ్మ అనే పదం కూడా అసహ్యం పుట్టేలా మారిపోయాడు

ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అతను ఎలాగో అలా బాగ చదువుకొని ఒక ఉద్యోగంలో స్థిర పడ్డాడు.

ఓ రోజు వాళ్ళ అమ్మ వదిలి పోయిన రోజును గుర్తు చేసుకుంటూ చీరాకు తో ఆ రోజు నుండి ఉద్యోగానికి కూడా వెళ్ళలేదు. ఉద్యోగానికి వెళ్ళక పోవడంతో ధనుష్, పై ఆధికారి ఉద్యోగం నుండి తీసేసాడు.ఆ బాదతో బయటకు వెళ్ళి  ఒంటరిగాఓ పార్క్ లో కూర్చొని ఉన్నాడు.

 మాములుగా రోజుసాయంకాలం వాకింగ్ కి వెళ్ళే డాక్టర్ గారు అదే పార్క్ కి వెళ్ళాడు.ఆ డాక్టర్ పార్కులో

ధనుష్ ని చూసి దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు.

డాక్టర్ ని చూసిన ధనుష్ ఏంటి డాక్టర్ గారు ఇలా వచ్చారు బాగున్నారా..! అని అడిగాడు.

అతనితో డాక్టర్ ఆ బాగనే ఉన్నాను ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడిగాడు.డాక్టర్ గారికి సమాదానంగా ధనుష్ పర్లేదు డాక్టర్ గారు బానే ఉంది. మీరు నన్ను దేవుడి లా కాపాడారు డాక్టర్ మీకు చాల థ్యాంక్స్ అండి,మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేను అని చెప్పాడు. అప్పుడు ఆ డాక్టర్, ధనుష్ తో థాంక్స్ చెప్పేది నాకు కాదు మీ అమ్మకి అని అన్నాడు. వెంటనే ధనుష్ కోపంతో ఆ పదం అనకండి డాక్టర్ అని అన్నాడు. అపుడు డాక్టర్.,అలా అనకు ధనుష్ నువ్వు ఆ రోజు ఓ చీటి పక్కన పడేసావు గుర్తుందా...! అని, డాక్టర్ తన జేబు నుండి ఆ చీటి తీసి చదువు ఒకసారి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళి పోయాడు.

అపుడు ధనుష్, డాక్టర్ గారు అంతలా ఆ చీటి చదువుమంటున్నాడేంటి,అందులో ఏముంది అస్సలు,అయిన ఒకసారి చదవడానికి ఏమవుతుందిలే అని ఆ చీటీ తీసి చదువుతున్నాడు. అది చదవగానే ధనుష్ అక్కడికక్కడే కుప్పకూలిపొయాడు. పశ్చాత్తాపంతో గట్టిగా ఏడుస్తూ అలా రాత్రి వరకు ఏడ్చి... ఏడ్చి...తన మనసు కుమిలి పోయి గుండె నిండ బాధ ను నింపుకొని అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు.

ధనుష్ యధావిధిగా తెల్లవారుజామునే నిద్ర లేచి సంతోషంగా వాళ్ళ అమ్మ గారి ఆశీర్వాదం తీసుకొని మరో ఉద్యోగం వెతుక్కున్నాడు. వాళ్ళ అమ్మకి మాట ఇచ్చినట్టుగానే గొప్ప స్థాయిలో స్థిరపడి తన అమ్మ పేరు మీదుగా ఒక అనాదాశ్రమంను కట్టించి మంచి పేరుతో స్థిరపడి పోయాడు.

ధనుష్ లో ఇంతలా మార్పు తెచ్చిన ఆ చీటీలో ఏముందంటే?

          నాన్న..! ధనుష్ ,నువ్వు నాతో  ఎప్పుడు ప్రతి పుట్టినరోజుకి బహుమతి ఇచ్చావు కదా...ఈసారి కూడా ఏమిస్తావు అని అడిగావు కదా

నీకు నా ప్రాణాన్నే దారపోస్తున్నా నేనెప్పుడూ నీతోనే ఉంటాను. నీలోనే ఉంటాను. ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటాను. నీ కడవరకు నేను నీ నీడనై వుంటాను. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నాన్న అని ఆ చీటిలో వాళ్ళ అమ్మ రాసింది.

అసలు నిజం ఏంటంటే?

ధనుష్ కి "హార్ట్ ప్రాబ్లం" ఉంది.

చూసారా!

ఓ తల్లి తన కన్నపేగు కోసం తన ప్రాణాల్ని సైతం లెక్కచేయదని మారుమారు నిరూపించింది

  మాతృదేవోభవ...........

                                                                                                     పి.సాయిప్రియ

                                                                                           ఎం.ఎ. తెలుగు,ద్వితీయ సంవత్సరం

        (2019-2021)