కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా నారాయణపురం లో వెంకటమ్మ, కారంచేటి తిరుమల మనోహరాచార్య దంపతులకు 22 జనవరి 1929 రోజున కె వి రాఘవాచార్య జన్మించారు.చిన్నప్పుడు కె వి రాఘవాచార్యులు తండ్రి నీడలోనే చదువుకోవడం వలన, చదువు అంటే ఇదే అని తెలియని రోజుల నుండే వారి విద్యా వ్యాసంగం ప్రారంభమైంది. చిన్నప్పటి నుండే స్తోత్రాలు పద్యాలు ఎక్కాలు పట్టించేవారు. తాను 5 వ సంవత్సరం నుంచి ఉత్తరాలను చదవటం నేర్చుకున్నాడు. ఆంధ్రనామ సంగ్రహం, సాంబ నిఘంటువు, అమరకోశం వంటివి ఉదయం చెప్తే మరుసటి రోజు నోటికి చెప్పేవాడు. తన ఎనిమిదవ ఏటలో ఇంట్లో తండ్రి దగ్గర దివ్య ప్రబంధాన్ని నేర్చుకుని నరసింహాచార్య సమక్షంలో అనుసంధానం చేసి ఆయన మెప్పు పొందారు. అది గొప్ప అనుభూతిగా భావించేవారు.
బ్రహ్మశ్రీ వేదమూర్తులు జోగా వెంకయ్య శర్మ దగ్గర వేదం, నమిలికొండ శ్రీ రంగాచార్యుల వద్ద సంస్కృతం నేర్చుకున్నాడు. శర్మ గారి దగ్గర దేవ యాజ్ఞిక కర్మ నేర్చుకుని దొడ్డు కాగితాలపై తాళ పత్రాల నుండి తీసుకొని రాసేవారు.
కె వి రాఘవాచార్య తన కవిత్వాన్ని సురవరం ప్రతాపరెడ్డి గారి గోల్కొండ కవుల సంచికలో రాయడం మొదలు పెట్టాడు. ఆ విధంగా ద్రావిడ వేదం, యాజ్ఞిక విధులు, సంస్కృతము నుండి నాటక చందోలంకార శాస్త్రీయ సాహిత్యం కూడా రాయడం ప్రారంభించాడు. మరియు లఘుసిద్ధాంత కౌముది, మాఘ కావ్యం, గీతాభాష్యం, సంప్రదాయ గ్రంధాలు, నైషధం, శాకుంతలం, సాహిత్య దర్పణం, ఉత్తర రామ చరిత్ర, వీర రాఘవ వ్యాఖ్యతో భాగవతంలోని 4 ఖండాలను చదివారు. ఊర్లో పండితులు లేనప్పుడు ఆరు మైళ్ళ దూరంలోని ఆవునూరు వెళ్లి ఆచి వెంకటాచార్యుల వద్ద పాఠాలు చదివేవారు.
పద్మావతి గారి తో కె వి రాఘవాచార్య వివాహము జరిగిన తరువాత శ్రీ మహావిష్ణువు యాగానికి తన తండ్రితో కలిసి హైదరాబాద్ వచ్చి ఋత్విక్కుగా పాల్గొన్నారు.
26 జనవరి 1950 లో మహాత్మా గాంధీ జాతి పిత పేరుతో సంస్కృత భాషలో వ్యాసరచన పోటీ జరిగితే అందులో కె వి రాఘవాచార్య మొదటి బహుమతి అందుకున్నారు. 1950 సెప్టెంబర్ 22న ఉర్దూ భాషలో ఉద్యోగ ఉత్తర్వు వచ్చింది. నెలకు ఇరవై ఐదు రూపాయల జీతం. మాసాయిపేట లో 25 సెప్టెంబర్ 1950 నాడు ఉద్యోగంలో చేరారు కె వి రాఘవాచార్యులు. హప్తుం మిడిల్ పరీక్షకు అనుమతి పొంది పరీక్షలు వ్రాసి 16 జూలై 1951 చక్ర్యాల అనగా సంగారెడ్డి దగ్గరలో ఏకోపాధ్యాయ పాఠశాలలో చేరారు. అక్కడ వుండగానే హెచ్. ఎస్. సి. లో సలాం సాహెబ్ అనే గణితోపాధ్యాయుడికి తెలుగు చెప్పి తన వద్ద గణితం నేర్చుకొని హెచ్. ఎస్. సి. పాసయ్యారు. పాఠశాలలో వేతనం పెరిగానే మెదక్ చేరారు. హిందీ ప్రచార సభ సంస్కృత భాషా ప్రచార సమితి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఆ సమయములో కుటుంబమంతా స్థిర పడుతూ ఉన్న సమయంలోనే 1962లో తండ్రిని పోగొట్టుకున్నారు. 1966లో సిద్దిపేటకు బదిలీ అయ్యారు. సిద్దిపేటలో అనేక పండిత సభలు, కవిసమ్మేళనాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఎక్కువ సమయాన్ని గడిపేవారు. వేముగంటి, కాపు రాజయ్య, రామరాజు, వెంకట్రావు వంటి వారితో సాహిత్య సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలలో పాల్గొన్నారు 1967లో సంస్కృతం డిగ్రీ పొందారు. 1971లో ఎం. ఏ.తెలుగు పూర్తి చేశారు 1972లో సెప్టెంబర్ లో అదిలాబాద్ డిగ్రీ కాలేజీలో ట్యూటర్ గా చేరారు సిద్దిపేట లో ఉండగానే పెద్ద కొడుకు కె.వి రమణాచారి వివాహం చేశారు.
1990 భగవద్విషయం - ఈడు అవతారిక అన్న తమిళ రచన అనువాదం చేశారు. 1992లో శ్రీ రామానుజ కీర్తి కౌముది అన్న పదహారు సంపుటాలలో శ్రీమద్రామానుజులు - వర్ణాశ్రమ ధర్మాలు అన్న పుస్తకాన్ని పన్నెండవ భాగం లో ప్రచురించారు.
పాదుకలను అంశంగా తీసుకొని వెయ్యి భావాలు చెప్పబడే విశిష్ట రచన వేదాంత దేశికులు పాదుకా సహస్రం వ్యాఖ్య రాశారు. వరదరాజ పంచాశత్, గరుడ దండకం, సుదర్శనాష్టకం, చతు:శ్లోకి, యతిరాజ సప్తతి, అభీతిస్థవం, శ్రీ స్తుతి, దయా శతకం, అచ్యుత శతకం, వంటి రచనలు చేశారు. శంకరాచార్యుల శ్రీ విష్ణు పాదా ది కేశాంత స్త్రోత్రానికి వ్యాఖ్యానం వ్రాశారు. దివ్య ప్రబంధ త్రయం అనే పేరుతో ఆళ్వారుల ప్రబంధాలలో మూడింటికి తెలుగు వివరణ చేశారు. పోతన భాగవతం లోని రుక్మిణీ కల్యాణం, నారాయణ శతకాలకు వైష్ణవీ, రాఘవీయ పేర్లతో వ్యాఖ్యానాలు రచించారు. 2010లో వేదాంత దేశిక దర్శనము అనే పేరుతో వేదాంత దేశికుల జీవన తాత్వికతను ప్రకటించారు యాదవాభ్యుదయం అన్న 24 సర్గల వ్యాఖ్యానం రాయడం ప్రారంభించాడు 2630 శ్లోకాలు ఈ కావ్య వాఖ్యాన రచనలో మొదటి భాగంగా నాలుగు సర్గలకు వాఖ్య రచించినారు.
జీవితమంతా చదువు కోసం చదివిన దానికి గుర్తింపు కోసం పాటుపడ్డ తరంలోని వారు శ్రీ కె.వి రాఘవాచార్యులు. తాను ఉపాధ్యాయుడిగా మొదలుపెట్టి కళాశాల అధ్యాపకుడి వరకు ఎదిగారు. అలాఎదిగిన శ్రీ కె. వి. రాఘవాచార్యులు గారు ఎన్నో బిరుదులు సన్మానాలు అందుకున్నారు. విశిష్టాద్వైత వేదాంత విశారద, శాస్త్ర విద్వన్మణి, వాచస్పతి, బిరుదులు, గుంటూరు, తిరుపతి వేద విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి వారి నుండి అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం పండిత పురస్కారం, శివానంద సద్గురు ఎమినెంట్ అవార్డు, ఉభయ వేదాంత విద్వత్సమ్మానం, రఘునాథ చార్యుల వారిచ్చే ఉభయ వేదాంత పురస్కారం, ఉగాది పురస్కారం, మహా వ్యాఖ్యాత పురస్కారం వంటి వాటితో పాటు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి పురస్కారాలు పొందారు. తిరుమల చారిటబుల్ ట్రస్ట్ ను తన సోదరులు పుత్రులతో ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం పండిత సన్మానాలను చేసి, సంస్కృత వాంజ్మయానికి ఎంతగానో సేవ చేశారు.ఆయన 05 ఆగస్టు 2016న పరమపదించారు.