ఆకలి అందంగా ఉండదు కాబోలు , అందుకే ఎవ్వరూ ఇష్టపడరు . అయినా ఆకలి అవసరం అలాంటిది .అది అందరికీ ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేనటువంటి పెనుభూతంలా  అది అందరినీ వెంటాడుతుంది.
      
     నేను చూశాను. ట్రాఫిక్ లో బిక్కు బిక్కు మంటు ఆకలితో అలమటిస్తున్న రేపటి తరానికి పౌరుడిగా  మారబోయే ఒక పిల్లవాణ్ణి. బక్కచిక్కిపోయిన  సన్నని ఆకారం. చింపిరి జుట్టు. చిరిగిన మసిగుడ్డల మధ్య తన దేహాన్ని దాచుకున్న వైనం.

     అర్ధాకలితో అరచేతి దోసిలితో అభిమానం చంపుకోని అడుక్కుంటున్న ధీనావస్థని నేను చూశాను. ఊరికే ఆకలి తీర్చుకోవడానికి ఇష్టపడక సిగ్నల్ పడగానే ఆగిన వాహనాల అద్దాలను తుడుస్తూ ఆకలిని అధిగమించడానికి పోరాడుతున్నాడు. ఒక వాహనం అద్దం తుడవగానే అందులో ఉన్న వ్యక్తి కారు అద్దం దించి తినడానికి ఏదో ఇచ్చాడు. అది తీసుకున్న పిల్లవాడి కళ్ళలో జీవితాన్ని జయించినంత సంతోషం. కానీ మళ్ళీ ఆకలి వేస్తుందని తెలుసుకోలేనంత      బాల్యం పాపం.


     సిగ్నల్ పడింది. ఆ పిల్లవాణ్ణి చూస్తూనే కారు ముందుకి పోనిచ్చాను. కానీ ఆ పిల్లవాడికి ఏ సహాయం చేయలేదనే బాధ  మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇలాంటి దృశ్యాలు ఈ మహానగరంలో రోజుకి ఎన్నో కళ్ళముందు పరిగెడుతుంటాయి.


     ఎప్పటిలాగే ఆ రోజు ఆవేదనతోనే కళ్ళు  సగం మూస్తూ తెరుస్తూ నిద్రపోయాను.

లేదు లేదు నిద్రపోయినట్టు నటించాను. తెల్లవారగానే ఏం జరగనట్టు అసలు ఏం గుర్తు లేనట్టు వరండాలో కూర్చోని పేపర్ చదవసాగాను. ఇంతలో మా భార్యామణి చాయ్ అందించింది. చాయ్ అందుకుంటూనే పేపర్ లో  వార్త చదివాను.

     ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పిల్లవాడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఆ వార్త నిన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చూసిన పిల్లవాడిది. ఆ పేపర్ లో ఉన్న దృశ్యం నన్ను హృదయ

విదారకుడిని చేసింది. 

     ఆ పిల్లవాడి జీవితం ముగిసింది. ఇక ఆ పిల్లవాడు ఆకలి కోసం ప్రతిదినం పోరాటం చేయనవసరం  లేదు. 

మరి ఇక్కడ ఆకలి గెలిచిందో.... 
        ఆకలి పై ఆ పిల్లవాడే గెలిచాడో..........


బి.చందు,
ద్వితీయ సంవత్సరం,
ఎం.ఏ.తెలుగు