నేనూ.......పుస్తకాన్ని
నన్ను గుర్తుపట్టారా..?
ఎందుకు గుర్తు పడతారు
నేను మీ ఆత్మీయ నేస్తమైన
సెల్ ఫోనంత ఖరీదైందాన్నీకాదు
అందమైందాన్నీ కాదు
నాజూకైందాన్నీ అసలే కాదు
అందుకేగా నేనంటే మీకంత చులకన
ఒకప్పుడు రాజులు, నవాబులు
నన్ను అంకితం పుచ్చుకోవడాన్ని
ఎంత గౌరవంగా భావించేవారో!
నాలో వారి పేర్లను
శాశ్వతంగా లిఖించుకోవడానికి
ఎంతగా తహతహలాడేవారో !
ఎన్నెన్ని యుద్ధాలు చేసేవారో!
సెల్ ఫోన్ మత్తులోపడి
నన్ను వదిలేసిన మీకేం తెలుసు ?
నన్ను కొనుక్కోవడానికి
ఎంతమంది చిరిగిన చొక్కా తొడుక్కున్నారో!
నన్ను చదవడానికి
ఎంతమంది జ్ఞానార్థులు
గ్రంథాలయానికి పరుగులెత్తే వారో !
ఈ చరవాణీ హస్తభూషితులకేంతెలుసు ?
మీచేతిలో
చందమామ కథల పుస్తకాన్నై
మీలో ఊహాశక్తిని పెంచింది నేనుకదూ!
మీ చేతిలో
బాలమిత్ర కథల పుస్తకాన్నై
మీలో భావుకత పెంచింది నేనుకదూ!
మీ చేతిలో
పంచతంత్ర కథల పుస్తకాన్నై
మీలో నైతికవిలువలను కూర్చింది నేనుకదూ!
మీ చేతిలో మత గ్రంథాన్నై
మీలో ఆధ్యాత్మికతను పెంచింది నేను కదూ!
నా చల్లని చేతి స్పర్శను మీకందించి
మిమ్మల్ని మేధావులుగా తీర్చిదిద్దింది నేను కదూ!
రేయింబవళ్లు మీకు తోడై నిలిచి
ఉద్యోగంతో మీకొక దారి చూపింది నేనుకదూ!
మీరు చూస్తున్న ఈ సాంకేతిక విప్లవ సౌధానికి
మూలాన్ని నేనుకదూ!
మీ విలువల వలువలకు దారాన్నైనిలిచి
మిమ్మల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దింది నేనుకదూ!
ప్రాచీన కాలాన్ని ఆధునిక కాలంతో
అనుసంధానిస్తున్న జ్ఞాన వారధిని నేను
ఎన్ని ఆకృతులు నావని
ఎంత చరిత్ర నాదని
చరిత్రనే ఇముడ్చుకున్న చరిత్ర కదా నాది
అందుకేనేమో...! కూసింత గర్వం నాకు
సెల్ ఫోన్ మోజులో పడి
మీరు నన్ను దూరం పెట్టినా
మిమ్మల్ని మాత్రం నా గుండెల్లో దాచుకుంటా
నన్ను అప్పుడప్పుడైనా కాస్త పలకరించండి
నాకు బంధువులున్నారని మురిసిపోతా
అనుకోకుండానైనా నావైపు ఓసారి తొంగి చూడండి
నా కోసం ఎదురు చూసే ఆత్మీయులు
నాకూ ఉన్నారని సంబరపడతా
నన్ను కాస్త ప్రేమగా తడమండి
నాకూ ఆప్తులున్నారని ప్రపంచానికి చాటుతా
నాకు కాస్త మీ ప్రేమను ఇవ్వండి
ప్రతిగా నేను జ్ఞానాన్నిచ్చి మీ ఋణం తీర్చుకుంటా
ఎన్.నరేష్ చారి S/O రామకృష్ణయ్య,ప్రస్తుత వృత్తి :స్కూల్ అసిస్టెంట్-తెలుగు(రంగంపేట,కుల్చారం,మెదక్)
కళాశాల పూర్వ విద్యార్థి: బిఏ(హెచ్.టి.పి)-2007
ప్రభుత్వ డిగ్రీ కళాశాల,సిద్దిపేట
0 Comments