రాములు పదేళ్ల బాలుడు. వాడికి ఎప్పుడు ఏదో ఒక సాహసం చెయ్యాలని భలే సరదా. రాములు గుణము తెలిసిన వాడి స్నేహితులకు వాడ్ని ఆటపట్టించాలని కోరిక కలిగింది. ఒకనాడు "రాములు నీకు ఈ విషయం తెలుసా?" అన్నాడు సోములు." ఏ విషయం?" అని ఆశ్చర్యం ప్రకటించాడు రాములు. మన ఊరి పక్కనున్న అడవిలో మాట్లాడే సింహం ఒకటి ఉందట. దానితో మాట్లాడిన వాళ్ళకి మిఠాయిలు, బిళ్ళలు ఇస్తోందట అంటూ చెప్పాడు సోములు. నిజంగానా? అని అడిగాడు రాములు. "అవునురా! కానీ దాని దగ్గరికి పొద్దున్నే వెళ్లాలట.అప్పుడైతేనే అది మిఠాయిలు ఇస్తుందట"అంటూ నమ్మకంగా చెప్పాడు సోములు."నీకెవరు చెప్పారీ?" విషయం అంటూ సోములు వంక అనుమానంగా చూస్తూ అడిగాడు రాములు.అడవి దగ్గర ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను"అని చెబుతూ అక్కడినుంచి మెల్లగా జారుకున్నాడు సోములు. ఆ రాత్రి రాములుకి నిద్ర పట్టలేదు. సింహం నిజంగా మాట్లాడుతుందా? అన్న విషయం కంటే మాట్లాడే ఆ సింహాన్ని తను చూసి రావాల్సిందే అన్న పట్టుదల కలిగింది వాడికి. మర్నాడు పొద్దున్నే లేచి చద్ది అన్నం తిని మరింత మూటగట్టుకుని అడవికి బయలుదేరాడు.
అడవిలో మధ్యాహ్నందాక తిరిగాడు.
కుందేలు.....లేడి పిల్లలు.... కొండచిలువలు.... నక్కలు.... ఖడ్గమృగాలు కనిపించాయి కానీ ఒక్క సింహం కూడా వాడికి కనిపించలేదు.
తిరిగి....తిరిగి వాడికి కాళ్ల నొప్పులు పుట్టాయి.... ఆకలి కూడా వేసింది. ఒక పెద్ద మర్రి చెట్టు క్రిందకు చేరి సద్ది మూట విప్పి ఆకలి తీర్చుకొని దప్పిక తీర్చుకోడానికి దగ్గర్లో ఏదైనా చెరువు ఉందేమోనని అటు ఇటు చూసుకుంటూ కొంత దూరం నడిచాడు.
వాడికి ఓ చెరువు కనిపించింది.
చెరువులో నీళ్లు తాగి గట్టు మీద వస్తుండగా గట్టు మీద గంభీరంగా నిల్చొని తన వైపే చూస్తున్న సింహం వాడికి కనిపించింది.
సింహం లావుగా.... బలంగా ఉంది. జూలు మెడ దగ్గర వత్తుగా వేలాడుతుంది. దాన్ని చూడగానే రాములుకి ఒక్క క్షణం భయం వేసింది.
"ఏయ్....ఎవరు నీవు....?" అంది సింహం గంభీరంగా.
"నా పేరు రాములు...నువ్వేనా మాట్లాడే సింహం" అన్నాడు రాములు ధైర్యం తెచ్చుకొని సింహం వైపు సూటిగా చూస్తూ.
"మాట్లాడే సింహం నేనే... నువ్వు ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు"తనని చూసి ఏమాత్రం భయపడకుండా సమాధానం ఇస్తున్నా రాములు వంక ముచ్చటగా చూస్తూ అంది.
"నిన్ను చూద్దామని వచ్చాను" అన్నాడు రాములు.
ఆ మాట్లాడే సింహానికి రాములు కి స్నేహం కుదిరింది చాలా సేపు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు.
ఇక చీకటి పడుతుంది నేను వెళ్తాను అంటూ లేచాడు రాములు సింహం అడవిలో దొరికే రకరకాల పండ్లు కోసుకొచ్చి రాములుకు ఇచ్చి వాడిని అడవి చివరిదాకా సాగనంపి అప్పుడప్పుడు వస్తుండు అని చెప్పింది.
రాములు ఊరిలోకి తిరిగొచ్చాడు. మర్నాడు పొద్దున్నే సోములుకి మిగతా స్నేహితులకి మాట్లాడే సింహాన్ని తాను చూసొచ్చిన విషయం చెప్పి సింహం తనకిచ్చిన అడవి పండ్లను పెట్టాడు. ఆ పళ్ళను శుభ్రంగా తింటూ "రాములు!మాకు అబద్ధాలు బాగా చెప్పావు గాని... అసలు ఎక్కడన్నా మాట్లాడే సింహాలు ఉంటాయా? మా చెవిలో పువ్వులు పెట్టకు "అంటూ ఎగతాళిగా నవ్వారు వాళ్లు.
రాములుకు రోషము వచ్చింది.
"అరేయ్ నేను చెప్పేది నిజం కావాలంటే నాతో అడవికి రండి మాట్లాడే సింహాన్ని మీకు చూపిస్తాను "అన్నాడు!
"మేం అడవికి రావడం ఎందుకు ?నువ్వే ఆ సింహాన్ని మన ఊరిలోకి తీసుకురా.... మాతోపాటు మన ఊరి వాళ్ళు అందరూ ఆ సింహం మాటలు వింటారు" అన్నాడు సోములు ఎగతాళిగా.....
"అలాగే! తీసుకొస్తాను" అన్నాడు రాములు తల ఎగరేస్తూ.
మర్నాడు పొద్దున్నే రాములు అడవికి బయలుదేరాడు .రాములు మాట్లాడే సింహాన్ని అడవిలోంచి ఊరిలోకి తెస్తున్నాడు అన్న విషయం ఆ నోటా ఆ నోటా ఊరంతా పాకింది. మాట్లాడే సింహం ఎక్కడ ఉంటుంది .రాములు చెప్పినదంతా అబద్ధాలు అని కొంతమంది.... రాములు అందరిలాంటి పిల్లాడు కాదు. వాడు అబద్ధాలు చెప్పాడు. నిజంగానే మాట్లాడే సింహం వాడికి కనిపించి ఉంటుందని కొంతమంది వాదించారు.
ఈ విషయం ఆ గ్రామమునకు అధికారి అయిన విష్ణుదత్తుడికి తెలిసింది. నిజంగా మాట్లాడే సింహం కనుక ఉంటే దానిని బంధించి రాజుకు అప్పగిస్తే తనకి అంతులేని బహుమానాలు ఇస్తాడానే దురాలోచనతో ఊరి పొలిమేరలో మంది మార్బలంతో సిద్ధంగా ఉండి అడవిలో నుండి రాములు వెంట వచ్చే మాట్లాడే సింహం కోసం ఎదురుచూడసాగాడు.
రాములు అడవిలో సింహం కోసం వెతికాడు ఎక్కడ కనిపించలేదు. అప్పటికి మధ్యాహ్నం అయింది.... మొదటిసారి ఆ సింహం దగ్గరికి చేరి ఆ చుట్టుపక్కల వెతికాడు.
సింహం కనిపించలేదు.
రాములుకి చాలా దిగులు వేసింది. స్నేహితుల దగ్గర మాట్లాడే సింహాన్ని ఊరిలోకి తెచ్చి చూపిస్తానని గొప్పలు పలికాడు.... ఇప్పుడు సింహం లేకుండా ఒంటరిగా వెళితే అందరూ తనని ఎగతాళి చేస్తారు పైగా ఇక ముందెప్పుడూ తన మాటలు నమ్మరు.సమయానికి ఈ మాట్లాడే సింహం ఎక్కడకు వెళ్ళిందో ఏది ఏమైనా మాట్లాడే సింహం లేకుండా ఒంటరిగా ఊళ్లోకి వెళ్ళేది లేదు అనుకుంటూ తన దగ్గరున్న ఒక చెట్టు కింద కూర్చుని ఆకలి తీర్చుకో సాగాడు.
ఆ సమయంలో ఎటువైపు నుండి వచ్చిందో గానీ మాట్లాడే సింహం రాములు దగ్గరికి వచ్చింది.
రాములు ఆనందం పట్టలేక తన స్నేహితులకు తనకు మధ్య జరిగిన పందెం విషయము ఆ సింహానికి చెప్పి "నువ్వు నా వెంట మా ఊరిలోకి రాకపోతే నాకు అవమానం" అన్నాడు. అందుకు సింహం రాములుతో "మిత్రమా! బాధపడకు, నీ వెంట నేను ఊర్లోకి వస్తాను.కానీ నేను క్రూరజంతువును.నాలో క్రూరత్వము ఉన్నంతవరకే మనుషులు నాకు భయపడతారు నేను సాధు జంతువుగా వాళ్లకు కనిపిస్తే మరుక్షణంనన్ను బంధించాలనో హతమార్చాలనో ప్రయత్నిస్తారు.... అయినా నీకోసం నేనేమైపోయినా పర్వాలేదు.నువ్వు నాకు ఏ కైక స్నేహితుడివి.నీకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే.... పద... వెళ్దాం"అంది.రాములుకి సింహం మాటల్లో భావం అర్థమైంది.
ఈ మాట్లాడే సింహం సృష్టిలో అపురూపమైన ప్రాణి.దీన్ని చూసిన తమ మనుషులు కాసేపు ఆనందించి మళ్లీ స్వేచ్ఛగా అడవిలోకి రాణిస్తారు అన్నది అనుమానమే. సింహం అన్నట్టు దీనిని బంధించాలని ప్రయత్నిస్తారు. తనని తాను కాపాడుకుంటానికి ఈ సింహం ఎదురు తిరుగుతుంది. ఆ ప్రయత్నంలో దీనిని హతమార్చడానికి కూడా వెనుదీయక పోవచ్చు. తనకి అవమానం జరగకుండా ఉండడం కోసం వచ్చిన సింహం ఉత్తి పుణ్యానికి ప్రాణాలు పోగొట్టుకుంటుంది. నిజమైన స్నేహితుడు మిత్రుడికి అపకారం జరుగుటకు ఇష్టపడతాడా? అని ఆలోచిస్తూ ఉండగానే సింహం రాములుతో "పదా! రాములు మీ ఊరికి వెళ్దాం!" అంది
"వద్దు మిత్రమా! వద్దు....నువ్వు నాకు దేవుడిచ్చిన నేస్తానివి...నా వెంట ఊరిలోకి వస్తే నీకు ప్రాణ హాని కలుగవచ్చు... నాకు జరిగిన అవమానం కన్నా నీ ప్రాణాలు చాలా విలువైనవి..." అంటూ సింహాన్ని వారించి ఊరి వైపు నడిచాడు.
రాములు....అప్పుడప్పుడు వస్తుండు" అంటూ అరిచింది సింహం వెనుకనుంచి. "అలాగే..." అంటూ ముందుకు సాగాడు వాడు..
నీతి: "నిజమైన స్నేహితుడు ఎప్పుడు తనవల్ల తన మిత్రుడికి అపకారం జరగాలని కోరుకోడు.."
-ఆస అభిజ్ఞ,ఎం.ఏ.తెలుగు,ప్రథమ సంవత్సరం,
ప్రభుత్వ డిగ్రీ&పిజి కళాశాల,సిద్దిపేట.
0 Comments